15లోగా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంమిర్యాలగూడ టౌన్, ఆగస్టు 8: ఈనెల 15లోగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం జరుగుతుందన్న ఆశాభావాన్ని టీఎన్‌జీఓల రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి వ్యక్తం చేశారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎంఎన్ ఫంక్షన్ హాలులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకుల మాతృమూర్తి కస్తూరి రామలక్ష్మమ్మ సంస్మరణ సభలో ఉద్యోగుల సమస్యలు-ప్రభుత్వ వైఖరి అనే అంశంపై ప్రసంగిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ అమలు, మధ్యంతర భృతి ఎందుకు ఆలస్యమవుతుందన్న ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. మే 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులతో సమావేశం నిర్వహించారని చెప్పారు. ఆగస్టు 10లోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎం, మంత్రులు హామీ ఇచ్చారన్నారు.ఈనెల 10లోగా కాకున్న 15 లోగా తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకుంటే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ చేపడ్తామన్నారు. మాతృమూర్తితోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాంలక్ష్మమ్మ ఏడుగురు కుమారులు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు.
రష్యాలో గోర్కి రచించిన అమ్మ పుస్తకాన్ని ఉటంకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ తన కుమారుడు కార్మిక ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన అనంతరం అతని తల్లి కొడుకు వారసత్వాన్ని ఎలా పుణికిపుచ్చుకుని ఉద్యమాన్ని నిర్వహించిన నేపథ్యాన్ని వివరించారు. అలనాడు రష్యా ఉద్యమంలో ఆమె పాత్ర కీలకమైందన్నారు. సమాజంలో తల్లి స్థానం ఉన్నతమైనదన్నారు. టీఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, డీఈఓ పీ.సరోజినిదేవి, జిల్లాల అధ్యక్షులు శ్రవణ్‌కుమార్, జానిమియా, కే.చంద్రారెడ్డి, మానవహక్కుల నేత పీ.సుబ్బారావు, జడ్పీ మాజీ చైర్మన్ సీడీ.రవికుమార్, డాక్టర్ జే.రాజు పాల్గొన్నారు.
0 Comments